Wednesday, 13 April 2016

శ్రీ కృష్ణ శతకం - మంజరీ ద్విపద పద్యములు -కొడవంటి సుబ్రహ్మణ్యం - సెట్టి లక్ష్మీ నరసింహ కవి కంద పద్యములకనుగుణంగా


1.శ్రీ రుక్మిణీనాధ సిరిగల స్వామి నారద సంగీత నాదప్రియుండ
ద్వారకా నిలయుడా దైవస్వరూప దిక్కునీవేమాకు దేవ శ్రీకృష్ణ  
2.తల్లివి నీవేను తండ్రివి నీవె నీడయు తోడును నీవెరా కృష్ణ  
పతియు గతియు నీవె పన్నగ శాయి గురుడు దైవము నీవె గోపాల కృష్ణ
3.నారాయణా ఈశ నల్లని స్వామి క్షీరాబ్ధి శయనుడా చిన్మయ మూర్తి
యదుకుల వీర నా అండనీవేర కరుణతో వేగమే కావరా కృష్ణ 
4 హరియను నామమే హరియించు కీడు హరినామ మహిమమ్ము ఆర్తితోపలుక
బాధలు తొలగును భాగ్యమ్ము కలుగు హరినీవె హరుడీవె హరిహర కృష్ణ
5. క్రూరాత్ముడైనను కూర్మితోబిల్వ ఆనందమందించి ఆశీర్వదించి
సుఖశాంతులతొ బ్రోచి  సంతోషపరచు సాటి వేలుపులేడు సౌందర్య కృష్ణ
శ్రీరామయనుపేర చిలుకను పిలువ రామచిలుక అయ్యె రమ్యమ్ముగాను
రామనామతపన రయమున ముక్తి రాముడవీవెయై రంజిల్లు కృష్ణ 6
7. కరుణించి కాపాడు కరుణాల వాల దివిజులు పూజించు దివ్యస్వరూప
ఆయుధాలంకృత ఆనంద రూప కాపాడరామమ్ము కంసారి కృష్ణ
8.నందయశోదకానందమ్ము నీవె మంధర గిరిధారి మాధవుడీవె
సుందర రూపుడా సురముని మిత్ర  అండ నీవే మాకు అచ్యుత కృష్ణ
9. ఓ కరుణాకర ఉజ్వల రూప మమ్ముల బ్రోచెడి మాధవ స్వామి
చింతల పోద్రోలు చిన్మయ రూప విశ్వేశ శ్రీ ఈ‌శ విష్ణు శ్రీ కృష్ణ
10.వేదంబు గనలేని వేల్పువు నీవు ఆదియౌ పరబ్రహ్మ అవతారమీవు
మాదిక్కు గాచెడి మధుసూదనుండ నీవేను మావేల్పు నిజముగా కృష్ణ
పదునాల్గు భువనాల పంకజ నాభ కుక్షియందుండగా కుదురుగా నీవు
దేవకీ గర్భమందెట్లుంటివోయి నీవెనా దివ్యమౌ నేత్రము కృష్ణ 11
12. అష్టమి రోహిణి అర్ధరాతిరిని అష్టమ గర్భాన ఆవిర్భవించి
దుష్టడౌ కంసుని దునిమితివౌర శిష్టులగాచేవు శ్రీహరి కృష్ణ
13.ఓ జగన్నాధుడా ఓపరమాత్మ రమ్యమౌ రేపల్లె లాలసమ్మయ్యె
ఆయశోదయె నీకు అమ్మాయెగదర చనుబాలుద్రావిన చైతన్య కృష్ణ  
14.అందెల గజ్జెల అలరారుచుండ చిందులు త్రోక్కేవు చిన్నికృష్ణయ్య 
యశోద మాతతొ ఆనందముగను మురియుచునాడేవు ముద్దుల కృష్ణ
15.హరిచందనంబుతో అలరె నీమేను కరముల సొంపైన కంకణ రవము
రత్నమ్ము ఉదరాన రమ్యమై మెరసె బాలప్రాయము బహు బాగాయె కృష్ణ  
16.పాణి తలంబున పారాడె వెన్న వేణి మూలంబున వెలసె పింఛమ్ము
ఆణిముత్యమ్ముతో అలరారె ముక్కు పన్నాగ శాయివి పరమాత్మ కృష్ణ
మడుగున కాళిందు మదమడంగించి పడగలపైచేరి పాదమ్ములరయ 
భరతనాట్యమ్మాడి భరతమ్ము పట్టు పాదమ్ములే నాకు పరము శ్రీకృష్ణ 17
బృందావనమ్ములో అందాల కృష్ణ వేణుగానముతోను వేడుక చేసి
ఆనంద బ్రహ్మవై అలరించినావు గోవింద నీవేర గోపాల కృష్ణ 18
యమునలో జలకంబు గోముగానెంచి వారిజ నేత్రలు చేరిరచ్చోట
చీరలు మ్రుచ్చిలి చిందులేసేవు పాడియా ఇదినీకు పరమాత్మ కృష్ణ 19
దేవేంద్రుడలుకతో వేవేగ వాన రాళ్ళతో కురిపింప రమ్యమ్ము గాను
గోవర్ధనమ్మెత్తి గోవుల గోప జనులగాచితివి జగమేలు కృష్ణ 20
అండజ వాహన హరి పరమాత్మ  బ్రహ్మాండములనెల్ల బంతులట్లాడు
గోవర్ధనమ్మది గోరంత పనియె విడ్డూరమేకాదు విశ్వేశ కృష్ణ 21
22 కంసారి విశ్వేశ సంసారివైతి ద్వారకా పురిలోన దర్పముప్పొంగ
కర్ణకుండలములు కడు శోభితములు పరమ యోగీశ్వరా పరమాత్మ కృష్ణ  
పదియారు వేలును పడతులు నూరు సుదతులెన్మిది మంది సుందరాకార
సంతృప్తి పరచిన సరసుడవీవె అద్భుత మహిమల ఆనంద కృష్ణ 23
పసుపు ధోవతిలోన పట్టెడటుకుల పంపె కుచేలుని పడతి ఆ ఇంతి
ఆరగించాతనికి ఐశ్వర్యమిచ్చి దీనునిగాచేవు దేవ శ్రీకృష్ణ 24
కావుము మానమ్ము కాకుత్స తిలక అనుచు ద్రౌపది వేడ ఆలసింపకను
వరమొసంగితివీవు తరగని చీర దిక్కు నీవే మాకు దేవకీ కృష్ణ 25
రణమున భీకర రవముతో నీవు పాంచజన్యమ్మునే పట్టిపూరింప
ఆకశమ్మంటెను ఆరక్కసిలకు గర్భములు పగిలె కంసారి కృష్ణ 26
విజయు సారధివైతి విజయమ్ము కలుగ హయముల ములుగోల అదలించినావు
రయమున తేరును  రణభూమి తోల భయమున రిపుసేన పాఱిరి కృష్ణ 27
దుర్జన నృపుల తుదముట్టనెంచి విజయు సారధివైతివాహవ భూమి  
పాండవుల్ రాజ్యము పాలించినారు దేవాది దేవుడా దేవ శ్రీకృష్ణ 28
అర్జును కావగ ఆహవ భూమి చక్రమ్ము చేపట్టి చంపంగ భీష్ము
చనునట్టి వీరత్వ చతురత మిన్న సర్వేసుడీవయ్య సర్వజ్ఞ కృష్ణ 29
రామావతారాన రవిసుతు గాచి ఇంద్రసుతుని చంపి ఇక్కట్లు తీర్చి
రవిసుతు బరిమార్చి రక్షించి విజయు అవతార మహిమౌన అచ్యుత కృష్ణ 30
బ్రహ్మాస్త్రమున గర్భ భ్రంశమ్ము చేయ గర్భమ్ములోనుండి కాపాడుమనిన
అభిమన్యు సుతుగాచు ఆనంద హేల వర్ణింప తరమౌన వరద శ్రీ కృష్ణ 31
గిరులందు నీవేమో గిరి మేరు వౌదు సురల ఇంద్రుడవీవు చుక్కలందేమొ
చంద్రుడవీవౌదు సామ్రాట్టువీవె మనుజ లోకానికి మాధవ కృష్ణ 32
చుక్కల లెక్కలు సుళువౌను సుమ్మి భూరేణువుల లెక్క పూరించ వచ్చు
అజునకైనతరమ హరి గుణ గణుతి అద్భుత మహిమల అచ్యుత కృష్ణ 33
కుక్షిని జగముల కుదురుగా నిలిపి నిక్షేప ప్రళయ నీరధి నడుమ
వటపత్ర శాయివై పవ్వళించేవు నీకునీవే సాటి నిజము శ్రీకృష్ణ 34
35 విశ్వోత్పత్తికిని విభుడవు నీవు విశ్వము రక్షించు విష్ణుడవీవు
హరుడవై విశ్వమ్ము హరియింతువీవు హరి హరా నీలీల అమరమ్ము కృష్ణ  
36.గిరిధారి వనమాలి గోపాలుడీవె ఎనలేని ఐశ్వర్య ఏలికవీవె
సృష్టికాధారుడా శృంగార పురుష శరణమ్ము శరణమ్ము శరణు శ్రీకృష్ణ
అంబుధి మీనమై అసురు సోమకుని హతమార్చి వేదాలు అవలీలదెచ్చి
బ్రహ్మ దేవునకిచ్చి  ప్రాపునొందేవు వేదాంత శేఖరా వేల్పీవు కృష్ణ 37
38.కూర్మావతారాన కుదురుగా నీవు మందర గిరిఎత్త మధియించినారు
క్షీరసాగరమందు సురలు దనుజులు ఘనుడవు నీవయ్య ఘనశ్యామ కృష్ణ
39. ఆదివరాహమై ఆ హిరణ్యకుని హతమార్చి జలధిలో అవనిరక్షించి
కోరల మాటున కుదురుగా నిల్పి కాపాడితివి గాదె కంసారి కృష్ణ
నరసింహ రూపాన నారాయణుండ కంబమ్మువిడివచ్చి కశిపు రక్కసుని 
ఉదరమ్ము చీలిచి ఉసురునే తీసి ధరనుద్ధరించిన దైత్య హర కృష్ణ 40
ధరణి మూడడుగుల దానమ్ము పట్టి వామనా జగములు వ్యాపించినావు
బలిని పాతాళమ్ము పంపించినావు ఏమని కీర్తింతు ఇందిరా కృష్ణ 41
పరశురాముడవయ్యు పరశువు పట్టి ఇరువది ఒకమార్లు ఏలికల్జంపి
ధర కశ్యపునకిచ్చి ధర్మమ్ము గాచి తపముజేసితివీవు తన్మయ కృష్ణ 42  
దశకంఠు బరిమార్చి దశరధ రామ సీతతో ఏతెంచి శీఘ్రమయోధ్య
పాలించితివి జనుల్ బహుబాగనంగ రామరాజ్యమ్మది రమ్యమ్ము కృష్ణ 43 
ఘనమగు భుజబల ఘనులగునట్టి ధేనుక ముష్టిక దనుజుల జంపి
ధరకెంతయో మేలు ధారపోసేవు రేవతీ పతి తోడ కావరా కృష్ణ 44
కపటపు రాజువై కరుణతో నీవు త్రిపురాసుర పత్నులపురూపమంద
వ్రతముచే కీర్తి సతతము కలుగ బుధ్ధావతారుడౌ బుద్ధ శ్రీ కృష్ణ 45
దుష్టులనెల్లర దునుమగానెంచి కల్కివై హయముపై కదలి వచ్చేవు
కలియుగమ్మిదియని కరుణించినావు లోక కర్తవు నీవు లోకేశ కృష్ణ 46
వనజాక్ష వామన సనకాది సేవ్య త్రైమూర్తులందుండు తన్మూల మూర్తి
తెలియకున్నానిన్ను తేటతెల్లముగ నీదరి ననుచేర్చి నిలుపు శ్రీ కృష్ణ 47
అపరాధములు ఎన్నొ అఘములెన్నెన్నొ కపటంపు పనులెన్నొ కలియజేసితిని
చపలుడ ననుగాచు చైతన్య మూర్తి శేషశయన గొల్తు చెలిమి శ్రీ కృష్ణ 48
నరపశువును నేను నామమాత్రుండ దురితాలు మరిగినే దుష్టుండనైతి
నిన్ను తెలియ నేను నిమిష మాత్రుండ హరినీవె నా ప్రాపు అచ్యుత కృష్ణ 49
పరనారి చేరంగ పరవశులైన జనులెందు గానరు జగదీశ నిన్ను
సన్మార్గులన్జేసి సద్భక్తినిమ్ము సారధివీవెగా సాకేత కృష్ణ 50
51 అరిషడ్వర్గమ్ములు ఆవురావురన అర్పించితిని మది అల్పుండనైతి
ఇపుడె నిను తెలిసి ఇవి మానుకొంటి మాధవా కేశవా మముగాచు  కృష్ణ
నిష్ఠతో నినుగొల్వనేరకున్నాను దుష్ట సహచరులు దుష్టమౌ చరిత
నాకునీవేదిక్కు నందనందనుడ కష్టమ్ము కడతేర్చు కరుణను కృష్ణ 52
గజరాజు బ్రోచిన గంభీర దేవ జంభాసురుని వైరి జలనిధి విష్ణు
అంభోజ నేత్రుడా అమర సంసేవ్య మముగావుమోదేవ మోహన కృష్ణ 53
దిక్కువు ప్రహ్లాదు అక్కునజేర్చ దిక్కువు పాండవుల్ దీనుల గావ
ఆ అహల్యకు దిక్కు అచ్యుత నీవె దిక్కువు నాకును దేవ శ్రీ కృష్ణ 54
55 హరి నీవె నాదిక్కు కరి బ్రోచినట్లు మకరిని మర్దించి సుకరముగాను
పరమేష్టి సురలును భజియింపుచుండ కావుమా ననుగూడ కైవల్య కృష్ణ
మురభంజ సురరంజ మునివందితుండ పురుషోత్తమా ఈశ పుత్తడి నాధ
కమలనాభా నన్ను కరుణించిబ్రోచు వరదుడే అభయమ్ము వామన కృష్ణ 56
57 క్రతువులు వ్రతములు అతులిత భక్తి దానము ధర్మము దయతోడ చేయ
కలుగు పుణ్యముకంటె కౌస్తుభు కొలువ అతులిత పుణ్యమ్ము అచ్యుత కృష్ణ దానవు బరిమార్చి దారకుగాచు నరసింహ అవతార నాధుడవీవు
అంభోజ నేతృడా అంబుధి తిలక మముగాచి రక్షించు మాధవ కృష్ణ 58
శతకోటి సూర్యుల చైతన్య మూర్తి అతులిత సద్గుణ అంబుజ నాభ
రతి రాజ జనక శ్రీ పతి నిన్ను సతతము సేవింతు సౌందర్య కృష్ణ 59
మందుడనైతిని మన్నించు నన్ను నిందల పాలైతి నీవెనా దిక్కు 
నందుని వరపుత్ర నమ్మితి నిన్ను కరుణించి కాపాడు కంసారి కృష్ణ 60
61 గజరాజ వరదుడా కౌంస్తుభ ధారి త్రిజగత్కళ్యాణ తేజమ్ము నీవు
భుజగేంద్ర శయనుడా భోగేంద్ర ఈశ విజయాప్తుడా మాకు వేల్పు శ్రీకృష్ణ గోపాల మురహరి గోపికా లోల పారద్రోలుదువంట పాపమ్ములన్ని
మాపాలి దైవమా మము కరుణించి కాపాడ రావేర కౌంస్తుభ కృష్ణ 62
63. దుర్మతినైతినే దుష్కర్మ వలన సద్బుధ్ధితోనుంటి సకలము విడచి
నిర్మలు చేయుమా నిష్కర్మ విభుడ అద్భుత మహిమల ఆనంద కృష్ణ
64.కరచక్రధారివి శూర ధీశాలి పార్వతీ నాధుడే ప్రణతులిడెను
నిర్వాణ నాధుడా నిత్య సంతోషి సర్వాత్మ ననుగాచు స్వామి శ్రీకృష్ణ
65.ఇంద్రుడు కొనియాడె ఈశ్వరా నిన్ను సత్యభామ వరద సౌందర్య రూప
దేవకీ తనయుడా దివ్యావతార నన్నుగావగరార నాధ శ్రీకృష్ణ
66.బలమేది కరిరాజు భాగ్యాన బ్రోవ బలమేది పాండవ భార్యనుగావ
బలమేది సుగ్రీవు బంగారు భవిత బలము నీవేనాకు భద్రాద్రి కృష్ణ
67.హరినామమును జిహ్వ అహరహం పలుక పసరు సోకి ఇనుము పసిడియైనట్లు
సురవందితా నేను సులభుడనైతి ముక్తిప్రసాదించు మురారి కృష్ణ
68.నీ నామమే మది నిండుగానుండ పాపమ్ములన్నియు పరిణతి చెందు
అందుకు సాక్షియే ఆ అజామిళుడు నీనామ స్మరణయే నిఖిలమ్ము కృష్ణ
69.నరసింహ మూర్తివై సర్వము నిండి స్తంబమ్మునందుండి సరగున వెడలి
దైత్యు మదమడచి దండించినావు సాక్షి ప్రహ్లాదుడు చైతన్య కృష్ణ
70.అల్ల సుభద్రకు అనుజుడైనావు బలభద్ర సోదరా బంధమోచకుడ
శుభమంగళార్చితా శోభాయమాన నంద నందనుడీవె ననుబ్రోచు కృష్ణ
71.కఱి మొఱ విని నీవు కనికరించేవు ప్రహ్లాదు మొఱ విని ప్రజ్వరిల్లేవు
నామొఱ విని రార నా ముద్దు లయ్య నిను నమ్మినానయ్య నిజము శ్రీకృష్ణ
72.ఘంటకర్ణుని నీవు ఘటికుజేసితివి అటులనే ననుబ్రోవ అరుదెంచవేర
కటకటా నాకంట కన్నీరు కారె గోపికా వల్లభా గోపాల కృష్ణ  
73 అశ్వమేధము చేయ ఐశ్వర్యమేమొ అదినాకు తెలియదు అంబుజనాభ
కైవల్య పదవియే కల్గునిన్ కొలువ అచ్యుతా నినుకొల్తు అహరహం కృష్ణ
74 భరతాగ్రగణ్యుడా భవ బంధ హరణ రఘురామ రణధీర రావణాహతక
అభయమ్మునిచ్చెడి అచ్యుతుండీవె ననుగావుమోహరీ సన్నుత కృష్ణ   
75 ఆ హిరణ్యకశిపు అంతమొందించి ప్రహ్లాదుగాచిన ఆహ్లాద సింహ
సురకోటి పొగడిరి శృంగార రాయ మముగాచు వేలుపా మధుర శ్రీ కృష్ణ
76 పుండరీకాక్షుడా పురుషోత్తముండ  పురహర హితుడవు పుణ్యాల రాశి
గోవింద గోపాల గోపికాలోల  హరి మమ్ము బ్రోచుమా గిరిధారి కృష్ణ
77 రామావతారాన రావణు దునిమి  ఆవిభీషణు నీవు అభిషిక్తుజెసి
రామ రాజ్యమ్ముగా రాజ్యమేలేవు  నిన్నునే కొలతును సన్నుత కృష్ణ
78 ఇహ పర సుఖమును ఇంపుగానొసగు  భూత పిశాచులనంతమ్ము చేసి
పీడల బారిన పడకుండ చేయు  నీ నామమే మది నిల్పితి కృష్ణ
79 గంగ గోదావరి తుంగభద్రలలో  అంగాంగ స్నానమ్ము మంగళ కరము
నీనామ గానమ్ము నిజ మంగళమ్ము  ముక్తి సోపానమ్ము మోహన కృష్ణ
80 ఆఘమేఘాలపై అరుదెంచి నీవు  కరిగాచినావుగా కంసారి కృష్ణ
కోదండ రాముడా కోమలాకార  వేవేల జన్మల వేల్పువు కృష్ణ 
81 విశ్వ దర్శనమున విశ్వేశుగాంచ  దుష్కర్మలన్నియు శుష్కమైపోవు
భాగ్యమ్ము నాకీవె భగవాను కృష్ణ శ్రీపతి నినుకొల్చు సిధ్ధుండ కృష్ణ
82 భవహర నామమ్ము భవ్య నామమ్ము  సుఖ సౌఖ్యములనిచ్చు శోభచేకూర్చు
నీనామమమృతం నిఖిలలోకాల  నా నిత్య పారాణి నాధ శ్రీ కృష్ణ
83 బలి ఇచ్చె దానమ్ము పాదత్రయమ్ము  నీకేమి కొదువరా నిఖిలేశ ఈశ
వామన అవతార వరదాన మహిమ  పాతాళమునకంపె పాపిని కృష్ణ
84 బ్రహ్మకు తండ్రివి బ్రహ్మాండ ధారి పాలను వెన్నను పలుమార్లు దొచ
రోటికి త్రాటితో కట్టె నీ తల్లి  శాపమ్ము బాపిన శౌరి శ్రీ కృష్ణ
85 రఘురామ శ్రీరామ రమ్యనామమ్ము  అఘములు పోగొట్టు అద్భుత నామం
శ్రీలక్ష్మి రమణుడా చింత నాకేల దయ చూపి కాపాడు దాత శ్రీ కృష్ణ
86 అప్పాలనిచ్చెడి అప్పాజివీవు  వేంకటరమణ నా వేల్పు నీవవేను
మముగాచు మాధవా మాదిక్కు నీవు  పాల సంద్రమ్మున ఫణిశాయి కృష్ణ
87 కొంచెపు వాడని ఎంచబోకుండ  కరుణించుమా నన్ను కరుణాలవాల
కొంచెము అధికమ్ము కొలతేమి గలదు  కరుణా రసమ్మది కావరా కృష్ణ
88 భక్తులనెవరేని భంగ పరచినను  హాని చేయుదురేని అణచివేయుదువు
దుష్టులదెగటార్చి ఇష్టుల బ్రోచు  నీవేనా దైవమ్ము నిత్య శ్రీ కృష్ణ
89 పంచేంద్రియమ్ములు వశముగాకుండె  నామొరాలింపుమో నా మనో నాధ
నీదరి చేర్చుకో నీరజాక్షుండ  నీవేనా నిధివయ్య కావేటి కృష్ణ
90 నావెంట నీవుండి నడిపించుచుండ  కంటికి రెప్పలా కాపాడుచుండ
పాపమ్ము ననుజూచి పరిహాసమాడె  నీ బంటు నేనయ్య నిఖిలేశ కృష్ణ
91 యమునకు వెరవను హరినీదు ఆన  నీ నామమెప్పుడు నిండుగా తలతు
నీ రూపు నామది నిండుగానుండు  కమలాక్ష జగదీశ కరుణించు కృష్ణ
92 దండమ్ము విశ్వేశ దండమ్ము దేవ  పుండరీకవరద దండమ్ము స్వామి
విశ్వంభరా హరి వేంకట రమణ  అండ నీవే మాకు అచ్యుత కృష్ణ
93 శ్రీలక్ష్మి నీచెంత శేషపానుపున  వాసుదేవా నీదు పాదమ్ములొత్తు
నంద కుమారుడా ననుగావ రార  నారాయణ మురారి నాగధర కృష్ణ
94 తిరుమణి ధరియింప తీరు పాపమ్ము  తిరునామ ధారణ తీరని హాయి
ముజ్జగమ్ములలోన ముక్తిమార్గమ్ము  భాగ్యమ్ము అతనిదే బలరామ కృష్ణ
95 మోక్ష ప్రదాయకా మోహన రూప  పార్వతి స్తుతియించు పన్నాగ శాయి
జగదభి రాముడా జగన్నాధుండా  దయతోడ కావుమా డైత్యారి కృవ్హ్న
96 జనులందరు కొలచు జగదేక వీర  సుందర పాదాల సురముని వంద్య
నీ బంటు నేనయ్య నీరజ నేత్ర  నన్ను రక్షింపుమా నయముగా కృష్ణ
97 శ్రీధర మాధవా చిన్మయ రూప  పురుషోత్తమాచ్యుతా పూతనా హతక
నీ పాద యుగళమ్ము నేను నమ్మితిని  పరమపదము చేర్చు పరమాత్మ కృష్ణ
98 రత్న కిరీటమ్ము రంజిల్లు శిరము  శంఖ చక్ర హస్త శకటారి కృష్ణ
కౌస్తుభ మణి హార కమనీయ రూప  శ్రీనాధ శృంగార శ్రీ హరి కృష్ణ
99 నందుని వరపుత్ర నవనీత చోర  అందెలు పాదాల అమరియుండంగ
శూరుడా గిరిధారి సొగసులు నీవె  నిన్ను నమ్మితి నేను నిజము శ్రీకృష్ణ  
100 మందర ధరుడా మదుసూదనుండా  ముక్కోటి దేవతల్ ముదముతో కొలచు
మునిగణ వందిత మోక్షప్రదాత  భక్త వత్సలుడ నా భాగ్యమ్ము కృష్ణ
101 శ్రీ కృష్ణు కొలచిన సిరులెన్నొ కలుగు  నిత్య ఆనందమ్ము నిర్మలత్వమ్ము
జన్మ రాహిత్యమౌ జన్నమ్ము అదియె  జన్మ ధన్యమ్మౌను జయము శ్రీ కృష్ణ
102 శ్రీవత్స గోత్రమ్ము శ్రీకృష్ణు కొలతు  కొడవంటి వంశమ్ము కోటిదండాలు
నే సుబ్రహ్మణ్యుండ నీవెనా వేల్పు  శరణంటిగావుమా శరణు శ్రీ కృష్ణ        

                                  కృష్ణ శతకము 
రచన: నరసింహ కవి (కంద పద్యములు)
శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీత లోల నగధర శౌరీ
ద్వారక నిలయ జనార్ధన కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా1
నీవే తల్లివి దండ్రివి-నీవే నా తోడునీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము-నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా2
నారాయణ పరమేశ్వర-ధారాధర నీలదేహ దానవ వైరీ
క్షీదాబ్ధిశయన యదుకుల-వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణా3
హరి యను రెండక్షరములు-హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహాత్మ్యము-హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా4
క్రూరాత్ముడజామీళుఁడు-నారాయణ యనుచు నాత్మనందను బిలువన్
ఏ రీతి నేలుకొంటివి-యేరీ నీసాటి వేల్పు లెందును కృష్ణా5
చిలుక నొక రమ఩ణి ముద్దులు-చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరుం
బిలిచిన మోక్షము నిచ్చితివ-వలరగ మిము దలఁచు జనులకరుదా కృష్ణా6
అకౄరవరద! మాధవ!-చక్రాయుధ! ఖడ్గపాణి! శార్జ్గ్ని! ముకుందా!
శక్రాది దివిజ సన్నుత!-శుక్రార్చిత! నన్ను గరుణ జూడుము కృష్ణా7
నందుని ముద్దుల పట్టిని-మందరగిరిధరుని హరిని మాధవు విష్ణున్
సుందరరూపుని మునిగణ-వందితు నిను దలంతు భక్తవత్సల! కృష్ణా8
ఓ కారుణ్య పయోనిధీ!-నా కాధారంబ వగుచు నయముగ బ్రోవన్
నాకేల ఇతర చింతలు-నాకాధిప వినుత! లోకనాయక కృష్ణా9
వేదంబులు గననేరని-యాది పరబ్రహ్మమూర్తి యనఘ! మురారీ;
నా దిక్కు జూచి కావుము-నీ దిక్కే నమ్మినాను నిజముగ కృష్ణా10
పదునాలుగు భువనంబులు-కుదురుగ నీ కుక్షి నిల్పుకుని నేర్పరివై
విదితంబుగ నా దేవకి-యుదరములో నెట్టు లొదిగి యుంటివి కృష్ణా! ||11||
అష్టమి రోహిణి ప్రొద్దున-నష్టమ గర్భమునఁ బుట్టి యా దేవకికిన్
దుష్టునిఁ గంసు వధింపవె-సృష్టి ప్రతిపాలనంబు సేయఁగ కృష్ణా! ||12||
అల్ల జగన్నాథుకు రే-పల్లియ క్రీడార్థ మయ్యెఁ బరమాత్మునకున్
గొల్ల సతి యా యశోదయుఁ-తల్లియునై చన్నుఁ గుడిపెఁ దనరగ కృష్ణా! ||13||
అందెలు గజ్జెలు మ్రోయఁగఁ-జిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందునిసతి యా గోపిక-ముందఱ నాడుదువు మిగుల ముఱియుచు కృష్ణా! ||14||
హరిచందనంబు మేనునఁ-గర మొప్పెడు హస్తములను గంకణరవముల్
ఉరమున రత్నము మెఱయఁగ-పరఁగితివో నీవు బాలప్రాయము కృష్ణా ||15||
పాణి తలంబున వెన్నయు-వేణీమూలంబునందు వెలయఁగఁ బింఛం
బాణీముత్యము ముక్కున-జాణువునై దాల్తు శేషశాయివి కృష్ణా! ||16||
మడుఁగుకుఁ జని కాళింగుని-పడగలపై భరతశాస్త్ర పద్ధతి వెలయం
గడు వేడుకతో నాడెడు-నడుగులు నే మదిని దాల్తు నచ్యుత! కృష్ణా! ||17||
బృందావనమున బ్రహ్మా-నందార్భకమూర్తి వేణు నాదము నీవున్
మందార మూలమున గో-విందా! పూరింతు వౌర! వేడుక కృష్ణా! ||18||
వారిజనేత్రలు యమునా-వారిని జలకంబు లాడ వచ్చిన నీవుం
జీరలు మ్రుచిలి తెచ్చితి-నేరుపురా యిదియు నీకు నీతియె కృష్ణా! ||19||
దేవేంద్రుఁ డలుకతోడను-వావిరిగా ఱాళ్లవాన వడిఁ గురియింపన్
గోవర్థనగిరి యెత్తితి-గోవుల గోపకులఁ గాచు కొరకై కృష్ణా! ||20||
అండజవాహన! విను బ్ర-హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీవున్
గొండల నెత్తితి వందురు-కొండికపని గాక దొడ్డ కొండా! కృష్ణా! ||21||
అంసాలంబితకుండల!-కంసాంతక! నీవు ద్వారకాపురిలోనన్
సంసారిరీతి నుంటివి.-సంసాదిక వైరి! సత్ప్రశంసిత! కృష్ణా! ||22||
పదియాఱు వేల నూర్వురు-సుదతులు నెనమండ్రు నీకు సొంపుగ భార్యల్
విదితంబుగ బహురూపుల-వదలక భోగింతు వౌర! వసుధను కృష్ణా! ||23||
అంగన పసుపున దోవతి-కొంగున నటుకులను ముడిచి కొనివచ్చిన యా
సంగతి విని దయ నొసఁగితి-రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణా! ||24||
హా వసుదేవకుమారక!-కావుము నా మానమనుచుఁ గామిని వేఁడన్
ఆ వనజాక్షికి నిచ్చితి-శ్రీవర! యక్షయ మటంచుఁ జీరలు కృష్ణా! ||25||
శుభ్ర మగు పాంచజన్యము-నభ్రంకషపగిది మ్రోవ నాహవ భూమిన్
విభ్రము లగు దనుజసుతా-గర్భంబులు పగులఁజేయు ఘనుఁడవు కృష్ణా! ||26||
జయమును విజయున కీయవె-హయముల ములుగోల మోపి యదలించి మహా
రయమున ఱొప్పవె తేరును-భయమున రిపుసేన విఱిగి పాఱగ! కృష్ణా! ||27||
దుర్జనులగు నృపసంఘము-నిర్జింపఁగ వలసి నీవు నిఖిలాధారా!
దుర్జనుల సంహరింపను-నర్జునునకుఁ బ్రేమ సారథైతివి కృష్ణా! ||28||
శక్రసుతుఁ గారుకొఱకై-చక్రముఁ జేఁబట్టి భీష్ముఁ జంపఁగఁ జను నీ
విక్రమ మేమని పొగడుదు-నక్రగ్రహ! సర్వలోక నాయక కృష్ణా! ||29||
దివిజేంద్రసుతునిఁ జంపియు-రవిసుతు రక్షించినావు రఘురాముఁడవై
దివిజేంద్ర సుతుని గాచియు-రవిసుతుఁ బరిమార్చి తౌర! రణమున కృష్ణా! ||30||
దుర్భర బాణము రాఁగా-గర్భములోనుండి యభవ! గావుమటన్నన్
నిర్భర కృప రక్షించితి-వర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా! ||31||
గిరులందు మేరు వౌదువు-సురలందున నింద్రుఁడౌదు చుక్కలలోనన్
బరమాత్మ! చంద్రుఁడౌదువు,-నరులందున నృపతివౌదు నయముగ కృష్ణా! ||32||
చుక్కల నెన్నగ వచ్చును-గ్రక్కున భూ రేణువులను గణుతింపనగున్
జొక్కపు నీ గుణజాలము-నక్కజ మగు లెక్కబెట్ట నజునకు కృష్ణా! ||33||
కుక్షిని నఖిల జగంబులు-నిక్షేపముఁజేసి ప్రళయ నీరధి నడుమన్
రక్షక! వటపత్రముపై-దక్షతఁ బవళించినట్టి ధన్యుఁడ కృష్ణా! ||34||
విశ్వోత్పత్తికి బ్రహ్మవు-విశ్వము రక్షింపఁదలఁచి విష్ణుఁడ వనగా
విశ్వముఁ జెఱుపను హరుఁడవు-విశ్వాత్మక! నీవె యగుచు వెలయుదు కృష్ణా! ||35||
అగణిత వైభవ! కేశవ!-నగధర! వనమాలి! యాది నారాయణ! యో
భగవంతుఁడ! శ్రీమంతుఁడ!-జగదీశ్వర! శరణు శరణు శరణము కృష్ణా! ||36||
మగమీనమవై జలనిధిఁ-జగతుని సోమకుని జంపి పద్మభవునకున్
నిగమములు దెచ్చియిచ్చితి-సుగుణాకర! మమ్ముఁ గరుణఁ జూడుము! కృష్ణా! ||37||
అందఱు సురలును దనుజులు-పొందుగ క్షీరాబ్ధిఁ దరుప పొలుపున నీ వా
నందంబగు కూర్మమవై-మందరగిరి యెత్తితౌర! మాధవ కృష్ణా! ||38||
ఆదివరాహుఁడ వయి నీ-వా దనుజు హిరణ్య నేత్రు హతుఁ జేసి తగన్
మోదమున సురలు పొగడఁగ-మేదిని వడి గొడుగు నెత్తి మెరసితి కృష్ణా! ||39||
కెరలి యఱచేతఁ గంబము-నదురుగ వేయుటయు వెడలి యసురేశ్వరునిన్
ఉరమును జీరి వధించితి-నరహరి రూపావతార! నగధర కృష్ణా! ||40||
వడుగవువై మూడడుగుల-నడిగితివౌ బలిని బళిర యఖిల జగంబుల్
దొడిగితివి నీదు మేనున-గడుచిత్రము నీ చరిత్ర ఘనుఁడవు కృష్ణా! ||41||
ఇరువదొకమాఱు నృపతుల-శిరములు ఖండించితౌర! చేగొడ్డంటన్
ధరఁ గశ్యపునకు నిచ్చియు-బరఁగవె జమదగ్ని రామ భద్రుఁడ కృష్ణా! ||42||
దశకంఠుని బరిమార్చియు
-గుశలముతో సీతఁదెచ్చి కొనియు నయోధ్యన్
విశదముగఁగీర్తినేలిన-దశరథ రామావతార! ధన్యుఁడ కృష్ణా! ||43||
ఘనులగు ధేనుకముష్టిక-దనుజులఁ జెండాడితౌర తగ భుజశక్తిఁ
అనఘాత్మ! రేవతీపతి-యనఁగా బలరామమూర్తి వైతివి కృష్ణా! ||44||
త్రిపురాసుర భార్యల నతి-నిపుణతతో వ్రతముచేత నిలిపితి కీర్తుల్
కృపగల రాజవు బళిరే-కపటపు బుద్ధావతార ఘనుఁడవు కృష్ణా! ||45||
వలపుల తేజీ నెక్కియు-నిలపై ధర్మంబు నిలువ హీనులఁ ద్రుంపన్
గలియుగము తుదిని వేడుక-కలికివి గానున్న లోక కర్తవు కృష్ణా! ||46||
వనజాక్ష! భక్తవత్సల-ఘనులగు త్రైమూర్తులందుఁ గరుణానిధివై
కన నీ సద్గుణజాలము-సనకాది మునీంద్రు లెన్నఁ జాలరు కృష్ణా! ||47||
అపరాథ సహస్రంబుల-నపరిమితములైన యఘము లనిశము నేనున్
గపటాత్ముఁడనై చేసితిఁ-జపలుని ననుఁగావు శేషశాయివి కృష్ణా! ||48||
నరపశువ మూడచిత్తుఁడ-దురితారంభుఁడను మిగుల దోషగుఁడను నీ
గుఱు తెఱుఁగ నెంతవాఁడను-హరి నీవే ప్రాపు దాపు నౌదువు కృష్ణా! ||49||
పరనారీ ముఖపద్మము-గురుతుఁగ గుచకుంభములను గొప్పును నడుమున్
అరయంగనె మోహింతురు-నిరతిని నిను భక్తిఁ గొల్వ నేరరు కృష్ణా! ||50||
పంచేంద్రియ మార్గంబుల-కొంచెపు బుద్ధినిఁ జరింతుకొన్ని దినంబుల్
ఇంచుక సజ్జన సంగతి-నెంచగ మిమ్మెఱిఁగినాఁడ నిప్పుడు కృష్ణా! ||51||
దుష్టుఁడ దురాచారుఁడ-దుష్ట చరిత్రుఁడను జాల దుర్బుద్ధిని నే
నిష్ట నినుఁ గొల్వనేరను-కష్టుఁడను ననుఁ గావు కావు కరుణను కృష్ణా! ||52||
కుంభీంద్ర వరద! కేశవ!-జంభాసుర వైరి దివిజ సన్నుత చరితా!
అంభోజనేత్ర! జలనిధి-గంభీరా? నన్నుగాఁవు కరుణను కృష్ణా! ||53||
దిక్కెవ్వరు ప్రహ్లాదుకు-దిక్కెవ్వరు పాండు సుతుల దీనుల కెపుడున్
దిక్కెవ్వరయ్యహల్యకు-దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా! ||54||
హరి! నీవె దిక్కు నాకును-సిరితో నేతెంచే మకరి శిక్షించి దయన్
బరమేష్టి సురలు పొగడఁగఁ-గరిఁగాచినరీతి నన్నుఁ గావుము కృష్ణా! ||55||
పురుషోత్తమ! లక్ష్మీపతి!-సరసిజగర్భాదిమౌని సన్నుత చరితా!
మురభంజన! సురరంజన!-వరదుఁడ వగు నాకు భక్తవత్సల! కృష్ణా! |56||
క్రతువులు తీర్థాగమములు-వ్రతములు దానములు సేయవలెనా లక్ష్మీ
పతీ! మిముఁ దలచినవారికి-నతులిత పుణ్యములు గలుగుటరుదా? కృష్ణా! ||57||
స్తంభమున వెడలి దానవ-డింభకు రక్షించినట్టి ఠీవిని వెలయన్
అంభోజ నేత్ర! జలనిధి-గంభీరుఁడ! నన్నుఁగావు కరుణను కృష్ణా! ||58||
శతకోటిభాను తేజుఁడ!-యతులిత సద్గుణగణాఢ్య యంభుజనాభా!
రతినాథ జనక! లక్ష్మీ-సతిహిత! ననుగావు భక్తవత్సల కృష్ణా! ||59||
మందుఁడ నేదురితాత్ముఁడ-నిందల కొడిగట్టినట్టి నీచుని నన్నున్
సందేహింపక కావుము-నందుని వరపుత్ర! నిన్ను నమ్మితి కృష్ణా! ||60||
గజరాజ వరద! కేశవ!-త్రిజగత్కల్యాణమూర్తి! దేవమురారీ!
భుజగేంద్ర శయన! మాధవ-విజయాప్తుఁడ! నన్నుఁగావు వేడుక కృష్ణా! ||61||
గోపాల దొంగ మురహర-పాపాలను బాఱఁద్రోలు ప్రభుఁడవు నీవే
గోపాలమూర్తి! దయతో-నా పాలిటఁ గలిగి ప్రోవు నమ్మితి కృష్ణా! ||62||
దుర్మతిని మిగుల దుష్టపుఁ-గల్మషములు జేసినట్టి కష్టుండ ననున్
నిర్మలునిఁ జేయవలె ని-ష్కర్ముఁడ నిను నమ్మినాను కావుము కృష్ణా! ||63||
దుర్వార చక్రధర కర!-శర్వాణీ ప్రముఖ వినుత! జగదాధారా!
నిర్వాణనాథ! మాధవ!-సర్వాత్మక! నన్ను గావు సరుగున కృష్ణా! ||64||
సుత్రామనుత! జనార్దన!-సత్రాజిత్తనయనాథ! సౌందర్యకళా
చిత్రావతార! దేవకి-పుత్రా! ననుఁగావు నీకుఁ బుణ్యము కృష్ణా! ||65||
బల మెవ్వఁడు కరిబ్రోవను-బల మెవ్వఁడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వఁడు రవిసుతునకు-బలమెవ్వఁడు నాకు నీవు బలమౌఁ కృష్ణా! ||66||
పరుసము సోఁకిన యినుమును-వరుసగ బంగారమైన వడుపున జిహ్వన్
హరి నీ నామము సోకిన-సురవందిత! నేను నటుల సులభుఁడ కృష్ణా! ||67||
ఒకసారి నీదు నామము-ప్రకటముగాఁ దలఁచువారి పాపప్ము లెల్లన్
వికలములై తొలఁగుటకును-సకలాత్మ యజామిళుండు సాక్షియె కృష్ణా! ||68||
హరి సర్వంబునన్ఁ గలఁడని-గరిమను దైత్యుండు పలుక గంబములోనన్
ఇరవొంద వెడలి చీల్పవె-శరణనఁ బ్రహ్లాదకుండు సాక్షియె కృష్ణా! ||69||
భద్రార్చిత పదపద్మ! సు-భద్రాగ్రజ! సర్వలోకపాలన! హరి! శ్రీ
భద్రాధిప! కేశవ! బల-భద్రానుజ! నన్నుఁబ్రోవు భయహర కృష్ణా! ||70||
ఎటువలెఁ గరిమొఱ వింటివి-యెటువలెఁ బ్రహ్లాదు కభయ మిచ్చితి కరుణన్
అటువలె నను రక్షింపుము-కటకట! నిను నమ్మినాఁడ గావుము కృష్ణా! ||71||
తటపట లేటికిఁ జేసెదు-కటకట పరమాత్మ నీవు ఘంటాకర్నున్
ఎటువలె నిపుణునిఁ జేసితి-నటువలె రక్షింపుమయ్య యచ్యుత కృష్ణా! ||72||
తురగాధ్వరంబు జేసిన-పురుషులకును వేఱె పదవి పుట్టుట యేమో
హరి! మిముఁ దలచిన వారికి-నరుదా కైవల్య పదవి యచ్యుత కృష్ణా! ||73||
ఓ భవనంధ విమోచన!-యో భరతా గ్రజ! మురారి! యోరఘు రామా!
యో భక్త కామధేనువ!-యో భవహర! నన్నుఁగావుమో హరి కృష్ణా! ||74||
ఏ తండ్రి కనక కశ్యపు-ఘాతకుఁడై యతని సుతుని గరుణను గాచెన్
బ్రీతి సురకోటి పొగడఁగ-నా తండ్రీ! నిన్ను నేను నమ్మితి కృష్ణా! ||75||
ఓ పుండరీకలోచన!-యో పురుషోత్తమ! ముకుంద! యో గోవిందా!
యో పురసంహార మిత్రుడ!-యో పుణ్యుఁడ! నన్నుఁ బ్రోవు మో హరికృష్ణా! ||76||
ఏ విభుఁడు ఘోర రణమున-వణు వధియించి లంక రాజుగ నిలిపెన్
దీవించి యా విభీషణు,-నా విభు నేఁ దలఁతు మదిని నచ్యుత కృష్ణా! |77||
గ్రహభయదోషముఁ బొందదు-బహుపీడలు చేర వెఱచుఁ బాయును నఘముల్
ఇహపర ఫలదాయక విను,-తహతహలెక్కడివి నిన్నుఁ దలచిన కృష్ణా! ||78||
గంగ మొదలైన నదులను-మంగళముగఁ జేయునట్టి మజ్జనమునకున్
సంగతి గలిగిన ఫలములు-రంగుగ మిముఁ దలచుఁ సాటి రావుర కృష్ణా! ||79||
ఆ దండ కావనంబునఁ-గోదండముఁ దాల్చినట్టి కోమలమూర్తీ!
నాదండ కావరమ్మీ-వేదండముఁ గాచినట్టి వేల్పవు కృష్ణా! ||80||
చూపుము నీ రూపంబును-బాపవు దుష్కృతములెల్లఁ బంకజనాభా!
పాపుము నాకును దయతో-శ్రీపతి! నిను నమ్మునాఁడ సిద్ధము కృష్ణా! ||81||
నీ నామము భవహరణము-నీ నామము సర్వసౌఖ్య నివహకరంబున్
నీనామ మమృత పూర్ణము-నీ నామము నేఁ దలంతు నిత్యము కృష్ణా! ||82||
పరులను నడిగిన జనులకుఁగురుచ సుమీ ఇది యటంచు గు!రుతుగ నీవున్
గురుచ్ఁడవై వేడితి మును-ధ్రఁ బాదత్రయము బలిని దద్దయు కృష్ణా! ||83||
పాలను వెన్నయు మ్రుచ్చిలఁ-ఱోలను మీ తల్లి గట్ట రోషముతోడన్
లీలావినోదివైతివి-బాలుఁడవా బ్రహ్మఁగన్న ప్రభుఁడవు కృష్ణా! ||84||
రఘునాయక నీనామము-లఘుమతితోఁ దలఁపఁగలనె లక్ష్మీరమణా!
అఘములఁ బాపుము దయతో-రఘురాముఁడ వైన లోక రక్షక కృష్ణా! ||85||
అప్పా! యిత్తువు దయతో-నప్పాలను నతిరసంబు లనుభవశాలీ
అప్పా! ననుఁ గను్గొనవే-యప్పా! ననుఁ బ్రోవు వేంకటప్పా! కృష్ణా! ||86||
కొంచెపువాఁడని మదిలో-నుంచకుమీ వాసుదేవ! గోవింద! హరీ!
యంచితముగ నీ కరుణకుఁ-గొంచెము నధికంబు గలదె కొలతయు కృష్ణా! ||87||
వావిరి నీ భక్తులకున్-గావరమున నెగ్గు సేయు గర్వాంధులనున్
దేవ! వధించుట వింటివి-నీ వల్లను భాగ్యమయ్యె నిజముగ కృష్ణా! ||88||
అయ్యా! పంచేంద్రియములు-నుయ్యాలల నూచినట్టు లూచఁగ నేనున్
జయ్యన్ గలుచుఁచు నుంటిని-గుయ్యాలింపుము మహాత్మ గుఱుతుగ కృష్ణా! ||89||
కంటికి రెప్పవిధంబున-బంటుగదా యనుచు నన్నుఁ బాయక యెపుడున్
జంటయు నీవుండుట నే-కంటక మగు పాపములను గడచితి కృష్ణా! ||90||
యమునకు నిఁక నే వెఱువను-కమలాక్ష! జగన్నివాస! కామితఫలదా!
విమల మగు నీదు నామము-నమరఁగఁ దలఁచెను వేగ ననిశము కృష్ణా! ||91||
దండమయా! విశ్వంభర!-దండమయా! పుండరీక దళనేత్ర హరీ!
దండమయా! కరుణానిధి!-దండమయా! నీకు నెపుడు దండము కృష్ణా! ||92||
నారాయణ! లక్ష్మీపతి!-నారాయణ! వాసుదేవ! నందకుమారా!
నారాయణ! నిను నమ్మితి!-నారాయణ! నన్నుఁ బ్రోవు నగధర కృష్ణా! ||93||
తిరుమణి దురితవిదూరము=తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్
తిరుమణి పెట్టిన మనుజుఁడు-పరమ పవిత్రుండు భాగ్యవంతుంఁడు కృష్ణా! ||94||
శ్రీలక్ష్మీనారాయణ!-వాలాయము నిన్నుఁ దలఁతు వంద్యచరిత్రా!
సర్వేశ్వర చక్రాయుధ-సర్వాణీ వినుత నామ జగడభీ రామా
నిర్వాణ నాధ మాధవ-సర్వాత్మక నన్నుగావు సదయాత కృష్ణా 95
ఏలుము నను నీ బంటుగఁ-జాలఁగ నిను నమ్మినాను సరసుఁడ కృష్ణా! 96
శ్రీధర! మాధవ! యచ్యుత!-భూధర! పురుహూత వినుత! పురుషోత్తమ! నీ
పాద యుగళంబు నెపుడు-మోదముతో నమ్మినాఁడ ముద్దుల కృష్ణా! 97
శిరమున రత్నకిరీటము-కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్
ఉరమున వజ్రపుఁ బతకము-సిరినాయక! యమరవినుత శ్రీహరి కృష్ణా! ||98||
అందెలఁ బాదము లందును-సుందరముగ నిల్పినావు సొంపమరంగా
సుందర! మునిజనసన్నుత!-నందుని వరపుత్ర! నిన్ను నమ్మితి కృష్ణా! ||99||
కందర్పకోటి సుందర!-మందరధర! భానుతేజ! మంజుల దేహా!
సుందర విగ్రహ! మునిగణ-వందిత, మిముఁ దలతు భక్తవత్సల కృష్ణా! ||100||
అనుదినము కృష్ణశతకము-వినినఁ బఠించినను ముక్తి వేడుకఁ గలుగున్
ధనధాన్యము గోగణములు-తనయులు నభివృద్ధి బొందుఁ దద్దయ కృష్ణా! ||101||
భారద్వాజసగోత్రుఁడ-గారవమున గంగమాంబ కరుణాసుతుఁడన్
పేరు నృసింహ్వాయుఁడను-శ్రీరమయుత! నన్నుఁ గావు సృష్టిని కృష్ణా! ||102||   
    
  



7 comments:

  1. Dhanyavadalu. Chakkani telugulo krishna satakaniki meeru ardham cheppadam maa adrustam .mee blog padilanga dachukunta. Like minded vaallaki pamputa. Marokamaru dhanyavadalu kodavanti subrahmanyam garu. Namaste
    Selav.

    ReplyDelete
  2. Dhanyavadalu. Chakkani telugulo krishna satakaniki meeru ardham cheppadam maa adrustam .mee blog padilanga dachukunta. Like minded vaallaki pamputa. Marokamaru dhanyavadalu kodavanti subrahmanyam garu. Namaste
    Selav.

    ReplyDelete
  3. మీరు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఈ శ్రీకృష్ణ శతకం అర్థతాత్పర్యాలతో అందజేయడం బహు ప్రశంసనీయం. ధన్యవాదాలు. కృతజ్ఞతలు.

    ReplyDelete
  4. మీరు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఈ శ్రీకృష్ణ శతకం అర్థతాత్పర్యాలతో అందజేయడం బహు ప్రశంసనీయం. ధన్యవాదాలు. కృతజ్ఞతలు.

    ReplyDelete
  5. మీరు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఈ శ్రీకృష్ణ శతకం అర్థతాత్పర్యాలతో అందజేయడం బహు ప్రశంసనీయం. ధన్యవాదాలు. కృతజ్ఞతలు.

    ReplyDelete
  6. మీరు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఈ శ్రీకృష్ణ శతకం అర్థతాత్పర్యాలతో అందజేయడం బహు ప్రశంసనీయం. ధన్యవాదాలు. కృతజ్ఞతలు.

    ReplyDelete